Date : 11 November 2026
Posted By : JTV EXPRESS

కబ్జాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి..

కబ్జాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి..

.కాముని చెరువు సమీపంలో ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు.. ఐదు రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని ఫిర్యాదు!

అక్రమ లేఅవుట్‌తో ప్లాట్ల విక్రయాలు.. హౌసింగ్ బోర్డు భూమిలో షెడ్డు, రిలయన్స్ టవర్లు ఏర్పాటు చేసి అద్దెల వసూళ్లు?

 కాముని చెరువు ముందు గాయత్రి హౌసింగ్ సొసైటీ పరిధిలో ప్రభుత్వ భూములు, ప్రజా రహదారులు ఆక్రమణకు గురయ్యాయని కాంగ్రెస్ నాయకుడు, బండి రమేష్ మిత్రమండలి జనరల్ సెక్రటరీ పఠాన్ బర్కత్ అలీ ఖాన్ ఆరోపించారు.

సర్వే నంబర్లు 994, 980, 982, 983, 984, 985, 986, 987, 992 పరిధిలో అనుమతులు లేని లేఅవుట్ రూపొందించి, ప్లాట్లుగా విభజించి లక్ష్మీ రాజు అనే వ్యక్తి విక్రయించినట్లు ఆయన ఆరోపించారు. ఆ లేఅవుట్ ప్రకారం ఉండాల్సిన ఐదు రహదారులు ప్రస్తుతం ఆక్రమణకు గురయ్యాయని, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

అలాగే సర్వే నంబర్ 981లోని హౌసింగ్ బోర్డుకు చెందిన భూమిలో సుమారు 400 గజాల స్థలాన్ని ప్రీకాస్ట్ వాల్‌తో చుట్టి, షెడ్డు నిర్మించి సాయిరామ్ వాటర్ సప్లయర్స్ పేరుతో అక్రమంగా నీటి వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అదే స్థలంలో రిలయన్స్ టవర్లు ఏర్పాటు చేసి ప్రతి నెలా అద్దెలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

2017లో కూకట్‌పల్లి మండల కార్యాలయానికి చెందిన ప్రసన్న అనే సర్వేయర్ సర్వే నిర్వహించి, సుమారు 4 ఎకరాల 17 గుంటల హౌసింగ్ బోర్డు భూమిలో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించడంతో అప్పట్లో కూల్చివేతలు చేపట్టారని బర్కత్ అలీ తెలిపారు. అయినప్పటికీ తిరిగి ఆక్రమణలు చేసి, అక్కడ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు, ప్రజా రహదారులను కాపాడాలని పఠాన్ బర్కత్ అలీ ఖాన్‌తో పాటు పలువురు స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

హౌసింగ్ బోర్డు అధికారులు, జీహెచ్‌ఎంసీ/సీఎంసీ అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు, HYDRAA కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. ఆక్రమణలు నిజమని తేలితే వాటిని తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూములు, ప్రజా రహదారుల పరిరక్షణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.