JTV EXPRESS
గాయత్రీ నగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు!..
ప్రతిపక్ష నాయకుల అండదండలతో అంతస్తులపై అంతస్తుల నిర్మాణమా? అధికారులకు స్థానికుల ఫిర్యాదు!
తులసి నగర్, వివేకానంద నగర్, పద్మావతి నగర్‌లో యథేచ్ఛగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు!కూకట్‌పల్లి: గాయత్రీ నగర్ డివిజన్ పరిధిలోని తులసి నగర్, వివేకానంద నగర్, పద్మావతి నగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల అండదండలతో కొందరు వ్యక్తులు భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తూ అంతస్తులపై అంతస్తులు నిర్మిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలో భవన నిర్మాణం కూలిన ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి ప్రమాదాలు తమ ప్రాంతాల్లోనూ చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, భవన నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి...